Yogi Vemana University VC, Registrar Issue In AP: కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో వీసీ, రిజిస్ట్రార్ల నియామకంపై వివాదం ముదురుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కృష్ణారెడ్డి, రాంప్రసాద్ రెడ్డికి కీలక పదవులు కట్టబెట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది. వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని నెల రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను భ్రష్టుపట్టించిందనే ఆరోపణలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా అదే తప్పు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డికి ప్రభుత్వం వీసీ బాధ్యతలు అప్పగించింది. లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తికి పదవులేంటంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. వీసీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నెలరోజుల నుంచి విద్యార్థి సంఘాలు, వామపక్ష నేతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఇది చాలదన్నట్లు తాజాగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా తప్పెట రాంప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని రద్దుచేయాలని ఆందోళన చేస్తుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు కొత్తగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మరో వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించాలంటూ నిరసనకు దిగారు.