తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడి హోటల్స్​లో దొరికేదంతా కల్తీ ఆహారమేనట! - మీరెప్పుడైనా తిన్నారా? - ADILABAD HOTELS CONTAMINATED FOOD

పెరిగిపోతున్న కలుషిత ఆహారాల హోటళ్లు - క్యాన్సర్ కారక, రసాయనాలు కలుపుతూ మిఠాయిల తయారీ - తింటే రోగాలు గ్యారంటీ!

Contaminated Food
Contaminated Food (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 2:15 PM IST

Contaminated Food in Restaurants in Adilabad :అప్పుడప్పుడూ రుచికరమైన భోజనం తిందామని అలా కుటుంబంతోనో, ఫ్రెండ్స్​తోనో బయటకు వెళ్లి హోటళ్లలో తింటాం. ఇంట్లో శుభకార్యాలప్పుడు మిఠాయిలు కొంటాం. కానీ వాటిని తయారు చేసే హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా అని ఆలోచిస్తామా? అంటే సమాధానం ఉండదు. ఇటీవల కాలంలో ఆహార భద్రత అధికారులు చేపడుతున్న తనిఖీలే ఇందుకు నిదర్శనం. కనీస నిబంధనలు పాటించకుండా వంటకాలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.

రోడ్డు పక్కనున్న చిన్న చిన్న కొట్లతో పాటు మంచి పేరున్న హోటళ్లు, మిఠాయి దుకాణాదారులు సైతం లాభమే ధ్యేయంగా క్యాన్సర్ కారక, గడువు మీరిన రసాయనాలు కలుపుతూ మిఠాయిలు చేసి అమ్ముతున్నారు. కుళ్లిపోయిన మాంసంతో వంటకాలు చేసి విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలియని అమాయక ప్రజలు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇది హైదరాబాద్‌ వరకే పరిమితం కాదు, జిల్లాలకూ వ్యాపించింది.

ఆదిలాబాద్ పట్టణంలో రాష్ట్ర టాస్క్​ఫోర్సు బృందం బాధ్యురాలు జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి నేతృత్వంలో ఆదివారం లక్ష్మీ నరసింహ ఫ్యామిలీ రెస్టారెంట్ (నాయుడు కుండ బిర్యానీ), ఢిల్లీవాలా స్వీట్ హౌజ్, లోటస్‌ గ్రాండ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్, వెంకటేశ్వర స్వీట్ హౌజ్‌లలో తనిఖీలు నిర్వహించారు. వాటిలో కుళ్లిన మాంసం, బూజుపట్టిన మసాలాలు, క్యాన్సర్ కారక నిషేధిత రసాయనాలు, కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా కేవలం ఆదిలాబాద్​లో అత్యంత కలుషిత, కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు అధికారిణి తెలిపారు. తనిఖీలు నిర్వహించి వస్తువులను సీజ్ చేసి ఆయా వాటికి నోటీసులు జారీ చేశారు.

  • ఆదిలాబాద్ పట్టణంలో 20 హోటళ్లు, మరో వందకు పైగా వివిధ రకాల ఆహార పదార్థాలు, మిఠాయి దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నవి ఇంకా ఎక్కువ.
  • ఆహార భద్రతా అధికారులు, పురపాలక సంఘం పరిధిలోని అధికారులు తరచూ హోటళ్లు, మిఠాయి దుకాణాలను తనిఖీ చేయాలి. కానీ వారు 'మామూళ్లు'గా తీసుకుని మమ అనిపిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యమేలుతోంది.
  • ఆహార భద్రతా జిల్లా అధికారులు గతేడాది పన్నెండు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు రికార్డులున్నాయి. ఈ సంవత్సరం ఒకే ఒక్క తనిఖీ నిర్వహించారు.
  • ఆదిలాబాద్ పట్టణంలోని ఓ హోటల్​లో కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో బిర్యానీ, ఇతర వంటకాలు చేసి వినియోగదారులకు పెడుతున్నారు. దుర్వాసన రాకుండా వెనీగర్​తో కడిగి బూజు పట్టిన మసాలాలు కలిపి వేయించి వంట చేసి అందిస్తున్నారని తెలిపారు.
  • పట్టణంలోని మిఠాయి షాపులో లడ్డూలు తయారు చేస్తున్న ఫొటో ఇది. చెమటమయంగా ఉన్న కార్మికులు వాటిని చేస్తున్నారు. క్యాన్సర్ కారక నిషేధిత రసాయనాలు, రంగులు మిఠాయిల్లో కలుపుతున్నారు. వీటిని తిన్న వారికి వ్యాధులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details