Hyd Consumer Commission2 Fined Mukta A2 Cinemas: చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్తుంటారు. అక్కడ చిత్రాలను వీక్షిస్తూ ఆనందాన్ని పొందుతారు. కానీ ఒక్కోసారి కొన్ని థియేటర్లలో సౌకర్యాల లేమి ఇబ్బందులకు గురి చేస్తాయి. కొందరు ఇక తప్పదని అడ్జస్ట్ అవుతూ సినిమాను చూస్తున్నారు. మరికొందరు వాటిని ప్రశ్నిస్తారు. అంతటితో ఆగకుండా తమకు కలిగిన అసౌకర్యంపై పోరాటం చేస్తుంటారు. తాజాగా వినియోగదారుల కమిషన్ వెలువరించిన తీర్పే ఇందుకు నిదర్శనం.
Consumer Commission in Telangana : ప్రేక్షకుడు హాయిగా సినిమాను చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బందికి గురిచేసిన ముక్త ఏ2 సినిమాస్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 జరిమానా విధించింది. టికెట్ డబ్బులు రిఫండ్ చేయడంతో పాటు ఫిర్యాదిదారు వేదనకు పరిహారంగా రూ.3,000లు, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1000 చెల్లించాలని ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతం ఆనంద్‌నగర్‌కు చెందిన నేరోళ్ల నిష్పర్ ఫిర్యాదుపై విచారించిన కమిషన్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చింది.
నేరోళ్ల నిష్పర్ కిసీ కా భాయ్ - కిసీ కా జాన్ సినిమా చూసేందుకు 2023 ఏప్రిల్ 28న అబిడ్స్‌లోని ముక్త ఏ2 సినిమాస్ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసినందుకు రూ.20 రుసుము, సినిమా టికెట్ కోసం రూ.150 చెల్లించారు. సినిమా ప్రారంభమైనా థియేటర్‌లో ఏసీ పనిచేయకపోవడం, ఏర్పాటు చేసిన కొన్ని ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వస్తుండటంతో నేరోళ్ల నిష్పర్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.