Congress MP Candidates Selection Telangana 2024 :లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్ల జాబితాను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈ సాయంత్రంలోపు నాయకుల పేర్లను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపాల్సి ఉంది. కానీ సాయంత్రం 6 గంటల వరకు కేవలం 20 మంది డీసీసీలు మాత్రమే గాంధీభవన్‌కు వివరాలు పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరో పది మందికి పైగా డీసీసీ అధ్యక్షులు వివరాలు ఇవ్వాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అప్పటి వరకు డీసీసీల నుంచి వచ్చిన ఆశావహుల వివరాలను నియోజకవర్గాలు వారీగా ఓ జాబితాను సిద్ధం చేస్తారు. పీఈసీ కమిటీ ఛైర్మన్, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు పాల్గొంటారు. రేపు జరగనున్న పీఈసీ సమావేశంలో డీసీసీలు పంపించిన పేర్లను నియోజకవర్గాల వారీగా పీఈసీ పరిశీలిస్తుంది.
Telangana Congress On Parliament Elections 2024 : అర్హులైన నాయకులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫారసు చేస్తుంది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పీఈసీ పంపిన పేర్ల జాబితాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి అర్హులైన, ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను గట్టిగా ఎదురొడ్డి గెలవగలిగిన సత్తా ఉన్న గెలుపు గుర్రాలను సీఈసీ ఎంపిక చేస్తుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ