Congress Leader Petrol Attack On BRS Councillor: మెదక్ జిల్లా రామాయంపేటలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ కార్యకర్త గణేశ్ పెట్రోల్ పోసి నిప్పటించే ప్రయత్నం చేశాడు. అడ్డుకోబోయిన అతని అనుచరుడిపై కూడా పెట్రోల్ దాడికి దిగాడు. అది గమనించిన స్థానికులు నిప్పు పెట్టే లోపే అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితుడు నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్త పోచమ్మ గణేశ్‌పై ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ దాడికి భూ తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Harish Rao React on Congress Leader Attack :మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పెట్రో దాడిని ఖండించిన హరీశ్‌రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిత్యం బెదిరింపులు, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులతో నిలువరించలేవని పేర్కొన్నారు. రామాయంపేట పట్టణ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడికి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.