Drinker Escapes With Police Body Camera : డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించి వారి వద్ద నుంచి బాడీ కెమెరా పరికరాన్ని కొట్టేసి పరారయ్యాడు ఓ మందుబాబు. నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇదీ జరిగింది : నగరంలోని హైదర్‌గూడలో ఓ ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే ఈ క్రమంలోనే వారికి మందుబాబులు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి ట్రాఫిక్ పోలీసుకు ఉన్న బాడీ కెమెరా పరికరాన్ని పట్టుకుని ఉడాయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పైగా బాడీ కెమెరా పోవడంపై కేసు సైతం నమోదు చేశారు.
సీసీఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నాలుగు రోజులుగా నగరంలో జల్లెడ పడుతున్నారు. కాగా పోలీస్ సిబ్బంది నుంచి బాడీ కెమెరాను కొట్టేసిన మందుబాబులు వాడిన బైక్ నెంబర్ వేరొక ద్విచక్ర వాహనానిదిగా అనుమానిస్తున్నారు. ఓ బైక్ ఒరిజినల్ నెంబర్‌ను ఫేక్‌గా క్రియేట్ చేసి బండికి అతికించి తిరుగుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.