Congress Focus on BRS MLCs Joinings :శాసన మండలిలో మెజార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకుని, ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఒకేరోజు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరిక సాగుతుండగా, ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడం ఇదే ప్రథమం. అదీ భారీగా ఉండటం ఆ పార్టీ ఎత్తుగడను నిరూపించింది.
అధికార కాంగ్రెస్ శాసనమండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్, యెగ్గె మల్లేశం, దయానంద్, బస్వరాజు సారయ్య చేరడంతో, బీఆర్ఎస్ నుంచి చేరికల సంఖ్య ఎనిమిదికి చేరింది. తొలుత మండలిలో జీవన్‌రెడ్డి ఒక్కరే ఉండేవారు. ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న గెలిచారు. బీఆర్ఎస్ నుంచి చేరిన 8 మందితో, కాంగ్రెస్ బలం 12కు చేరింది. మరికొంతమందిని చేర్చుకుని బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కాంగ్రెస్ యత్నిస్తోంది.
ప్రజాభవన్‌లో నేడు సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ - revanth cbn meeting today
శాసనమండలిలో మొత్తం 40 స్థానాలకు గానూ గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు ఇంకా భర్తీ కాలేదు. ప్రస్తుతం ఉన్న 38లో, కాంగ్రెస్ బలం 12కి చేరింది. మిగిలిన 26లో ఇద్దరు మజ్లిస్, ఒకరు బీజేపీ, ఒకరు పీఆర్‌టీయూ రఘోత్తం రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నర్సిరెడ్డి ఉన్నారు. మిగిలిన 21 మంది బీఆర్ఎస్ సభ్యులు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళికతో సాగుతోంది. అధికార పార్టీ ఎత్తుగడకు గులాబీ పార్టీ నివ్వెరపోయింది. మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు చొరవ చూపుతున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుని, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక నిర్ణయాన్ని ఆ నియోజకవర్గం స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదే విషయమై సరితా తిరుపతయ్య మద్దతుదారులు గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడింట రెండొంతుల మెజార్టీ ప్రకారం, 17 మంది ఎమ్మెల్సీలు చేరితే బీఆర్ఎస్ శాసనమండలి పక్షం కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్‌కు భారీ షాక్ - కాంగ్రెస్ గూటికి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు - 6 BRS MLCs JOINED CONGRESS