Congress is Focusing on Allotment of MLCs in MLA Quota : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా మండలి పదవుల కోసం పోటీ పెరుగుతోంది. నాలుగు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో లాబీయింగ్ మొదలైంది. వచ్చే ఏడాది మార్చి 29 నాటికి ఐదు ఎమ్మెల్సీ పదవుల గడువు ముగియనుండడంతో వారి స్థానంలో కొత్తవారిని భర్తీ చేయాల్సి ఉంది. నాలుగు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్‌కు దక్కనుండటంతో పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అవకాశమిచ్చే దిశలో రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది.
ప్రత్యేక దృష్టి సారించిన నాయకత్వం : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చెందిన సత్యవతి రాఠోడ్, మహమూద్ అలీ, శేరిసుభాష్ రెడ్డి, యగ్గే మల్లేష్, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్‌హుస్సేన్‌ల పదవీకాలం వచ్చే మార్చి 29తో ముగియనుంది. మరోవైపు రెండు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. అయితే ఆ మూడు పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటా కింద మాత్రమే నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతుంది. అసెంబ్లీలో బలాబలాల దృష్ట్యా కాంగ్రెస్‌కి- 4, బీఆర్‌ఎఎస్‌కి-1 దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎమ్మెల్సీల భర్తీపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నా, విధేయులకే పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం, పీసీసీ హోదాలో ప్రతిపాదన చేసినా పార్టీ హైకమాండ్ వద్ద జరిగిన మార్పులు, చేర్పుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు.
అవకాశం ఇవ్వమని కోరుతున్నారు :మార్చిలో ఖాళీ అయ్యే పదవుల్లో ఆయనకి అవకాశం లభిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీల్లో ఐదారుగురు పోటీ పడుతున్నా సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఫయూమ్ ఖురేషికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు హరివర్దన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వేళ టికెట్ కోల్పోయి, బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చి గెలుపుకోసం కృషి చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని కోరుతున్నారు.