Congress Govt Gas Cylinder Scheme :రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955గా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రూ.500కే గ్యాస్ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!
వాడకంలో ఉన్న సిలిండర్లకే రాయితీ
- నూతనంగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహారభద్రత కార్డులున్నవారికీ అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే తెలంగాణ ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ వర్తిస్తుంది.
- గృహ వినియోగదారుడు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు.
- ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారుల గుర్తించారు. ఈ సంఖ్యతో పథకం ప్రారంభం కానుంది.
- తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులకు ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. ఎస్‌బీఐ నోడల్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర సర్కార్ ఇచ్చే అప్రూవ్ అమౌంట్ బ్యాంకులో ఉంటుంది. అనంతరం రాయితీ సిలిండర్లు సరఫరా చేశాక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిర్ణీత సబ్సిడీని బదిలీ చేస్తుంది.