Congress Govt Gas Cylinder Scheme : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు హమీలను అమలు చేయగా, తాజా మరో రెండు హామీలైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహాజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది. ఇందులో భాగంగా గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది.
500 Rupees Gas Cylinder Scheme :సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితాను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. సంవత్సరానికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి (500 Rupees Gas Cylinder) అర్హులైన వారి మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా గరిష్ఠంగా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 8గా తేలింది.
రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై క్లారిటీ వచ్చేసింది - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!
మహాలక్ష్మి పథకానికి కొద్దిరోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్ఠంగా ఏడాదికి ఎనిమిదిగా నిర్ధారణ అయ్యింది.