KTR Tweet on MBBS Admissions :రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో జాప్యంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వీడేదెప్పుడు? కాంగ్రెస్ సర్కారు వైద్య విద్య ప్రవేశాలు చేసేదెప్పుడని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. డెడ్ లైన్ సమీపిస్తున్నా ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? అన్న ఆయన, గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎందుకు ఇంత అస్థవ్యస్థంగా మార్చేసిందని ప్రశ్నించారు. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆక్షేపించారు.
స్థానికత అంశంలోనే సమస్య : తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీవోతోనే ఈ సమస్య అని కేటీఆర్ దుయ్యబట్టారు. అనవసర జీవో తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన ముఖ్యమంత్రి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే, మళ్లీ సుప్రీం తలుపు తట్టారని అసహనం వ్యక్తం చేశారు.
రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణం: కేటీఆర్
అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పు చెప్పి నాలుగు రోజులు గడుస్తున్నా వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం కాకపోతే మరేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా, తెలంగాణలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అక్టోబర్ 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం దుర్మార్గం, క్షమించరాని నేరమని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి డెడ్ లైన్ లోగా పూర్తిచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లితే సహించేది లేదని, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి: కేటీఆర్
'విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం - ప్రభుత్వానికి ఎందుకింత మొండిపట్టు' - KTR on Medical Admissions Issue