తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - ఇక నుంచి ప్రతి ఏటా ఉద్యోగ జాతరే! - మరో వారంలో జాబ్ క్యాలెండర్ - TELANGANA JOB CALENDAR - TELANGANA JOB CALENDAR

Job calendar in Telangana 2024 : రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ వెలువరించేందుకు సిద్దమవుతోంది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు తాజాగా సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

Job calendar in Telangana
Job calendar in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 7:12 AM IST

Telangana Government Job Calendar 2024 : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరో వారంలో ఈ ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పనిలో బిజీ అయింది. అంతే కాదు ఇక నుంచి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా ప్రణాళికలు రచించేందుకు సమాయత్తమవుతోంది.

టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటుగా పోలీసు, గురుకులాలు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్ల వివరాలను, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెల్లడించేందుకు, ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ ఆయా విభాగాలకు లేఖలు రాసింది. ప్రామాణిక ముసాయిదాతో పాటుగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాధిపతులతో పాటుగా నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుదిరూపు తీసుకువచ్చింది.

టీజీపీఎస్సీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ‘‘రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్‌ ఉండాలి" అని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - రైల్వే జాబ్​ క్యాలెండర్ 2024 విడుదల

యూపీఎస్సీ మాదిరిగా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఛైర్మన్‌తో మాట్లాడి, విధానాల్ని తెలుసుకున్న విషయం తెలిసిందే. ముసాయిదా క్యాలెండర్‌లో కొద్దిపాటి మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీకి ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సీయే ప్రధాన భూమిక పోషించింది. ఇందులో, ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు.? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి.? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్నే అంశాలపై స్పష్టమైన గడువు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నిర్దేశించిన గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తి అయ్యేవిధంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. న్యాయవివాదాలు తలెత్తకుండా, సర్వీసు నిబంధనల ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గ్రూప్‌-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. అలాగే గ్రూప్‌-2 పరీక్షను షెడ్యూలు ప్రకారం ఆగస్టులో పూర్తిచేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది.

రాష్ట్రంలో ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ - ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టీఎస్‌పీఎస్సీ

ABOUT THE AUTHOR

...view details