తెలంగాణ

telangana

ETV Bharat / state

మొన్న గవర్నమెంట్ టీచర్​గా ఎంపిక చేశారు - నిన్న సారీ అంటూ తీసేశారు

డీఎస్సీ-2024లో ఎంపికల్లో గందరగోళం - నిజామాబాద్​లో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు

Confusion In Selection Of Teacher Jobs
Confusion In Selection Of Teacher Jobs In Nizamabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 7:18 AM IST

Confusion In Selection Of Teacher Jobs In Nizamabad : డీఎస్సీ-2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని ఏడుగురిని ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ, ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ క్రమంలోనే శనివారం నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.

ఎస్జీటీ తెలుగు మాధ్యమంలో 257వ ర్యాంకు సాధించిన ఉట్నూర్‌ లావణ్యకు నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. గత నెల 16న బాధ్యతలు చేపట్టిన ఆమె, శనివారం వరకు (23 రోజులు) విధులు నిర్వర్తించారు. కాగా సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 125వ ర్యాంకు అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని తెలిపారు. దీంతో దీనిని సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీంతో బాధితురాలు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటూ రోధిస్తూ ఓ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సోమవారం ఉన్నతాధికారులను కలిసి వివరిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు స్పందిస్తూ విచారణ చేయిస్తానని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇదే జిల్లాలో కొద్ది రోజుల క్రితం దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన రచన డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్ (భౌతిక శాస్త్రం) విభాగంలో 5వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 60వ ర్యాంకు సాధించింది. కానీ ఎస్‌ఏ విభాగంలో మూడే పోస్టులు ఉండడంతో తనకు వచ్చే అవకాశం లేదని గమనించి ఎస్జీటీ పోస్టు ఎంచుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లింది. అధికారులు మాత్రం ఎస్సీ రిజర్వేషన్‌ ఉన్నందున ఎస్‌ఏ పోస్టు వస్తుందని తెలిపారు. దీంతో ఆ యువతి ఎస్జీటీ పోస్టుకు నాట్‌ విల్లింగ్‌ లేఖ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్‌ఏ పోస్టుకు ఎంపికైనట్లు నియమాక పత్రం ఇచ్చారు. దీంతో ఉద్యోగంలో చేరేందుకు డీఈవో కార్యాలయానికి వెళ్తే, కంప్యూటర్‌ తప్పిదంతో ఉద్యోగం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. ఒక్కసారిగా కంగుతున్న యువతి ప్రజావాణికి వచ్చి కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం ఇచ్చారు. తనను ఆదుకోవాలని వేడుకున్నారు.

అయ్యో పాపం : ఒకేసారి 2 జాబ్స్ - ఒకటి వదిలేస్తే రెండోదీ పోయింది

డీఎస్సీ-2008 బాధితులకు గుడ్​ న్యూస్ - అతి త్వరలోనే టీచర్లుగా పోస్టింగ్​లు

ABOUT THE AUTHOR

...view details