Common People Problems Due to Increased Vegetable Prices : పండుగ వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా, ఉల్లి కొనలేని పరిస్థితి. రైతు బజార్లలో రాయితీపై పంపిణీ కొంతమేర ఉపశమనం కల్గిస్తున్నా సామాన్యుల నెలవారీ బడ్జెట్ లెక్క తప్పుతోంది.
నెల క్రితం వర్షాలు, వరదల వల్ల అవస్థలు పడ్డ విజయవాడ వాసులు ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరలతో సతమతమవుతున్నారు. పండుగ వేళ సంచి నిండా కూరగాయలుకొనే పరిస్థితి లేకుండా పోయింది. పటమట రైతుబజార్‌లో నెల క్రితం 40 రూపాయలున్న కిలో టమోటా ఇప్పుడు 65 రూపాయలకు ఎగబాకింది. ఉల్లిఘాటు కిలో 40 నుంచి 50 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్‌లో ఇంకొంచెం ఎక్కువే. ఇక దొండ, బీర, క్యారెట్ కిలో 40 పలుకుతుంటే క్యాప్సికం, బీన్స్, చిక్కుడు కిలో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. ధరాభారంతో కిలోకు బదులు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు సామాన్యులు.
"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు
రైతుబజార్‌లో టమోటా, ఉల్లి గడ్డలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. రాయితీపై కిలో టమోటా 50, కర్నూలు ఉల్లి 32 రూపాయలకు అందిస్తున్నారు. ఐతే ఒక్కొక్కరికీ కిలో చొప్పునే విక్రయిస్తున్నారు. అది కూడా క్యూకట్టాల్సిన పరిస్థితి. రాయితీపై ఈ నెల 13 వరకే సరఫరా చేయనున్నారు. ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లూ బాగా తగ్గాయని వ్యాపారులూ నిట్టూరుస్తున్నారు.