తెలంగాణ

telangana

ETV Bharat / state

'తరతరాలుగా వస్తున్న భూములు శాశ్వతంగా కోల్పోతున్నారు - కాస్త మానవత్వంతో ఆలోచిద్దాం' - CM REVANTH ON LAND ACQUISITION - CM REVANTH ON LAND ACQUISITION

CM review on Land compensation in Telangana : రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, ఇతర సమస్యలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సీఎం సూచించారు. పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 6:57 AM IST

CM Revanth Reddy Key Comments On Land Acquisition : జాతీయ రహదారుల కోసం భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులతో కలెక్టర్ల నేరుగా మాట్లాడటంతో పాటు, నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, ఇతర సమస్యలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ, భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని కలెక్టర్లను సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నందున భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. తరతరాలుగా వస్తున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలని, రైతులను పిలిచి మాట్లాడి ఒప్పించాలని కలెక్టర్లకు సూచించారు.

రీజినల్ రింగు రోడ్డు దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నెంబర్ కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే నంబరు కేటాయింపునకు అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణకు ఆటంకాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అలైన్ మెంట్ విషయంలో కొందరు రైతులు వేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపున‌కు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు.

నాగపూర్ - విజయవాడ కారిడార్​లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల్లో రహదారి వెళ్తున్నందున, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున.., ఖమ్మం నుంచి అశ్వారావుపేట జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలన్న ఎన్ హెచ్ఏఐ సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని మంత్రి కోరారు.

నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గం - ఇలాగైతే మన బిడ్డలకు కొలువులు వచ్చేదెలా? : కేటీఆర్ - KTR OPPOSED GOVT LANDS MORTGAGE

నాగపూర్-విజయవాడ కారిడార్ రహదారిపై పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాస్ లు నిర్మించాలని ఎన్ హెచ్ఏఐ అధికారులను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కోరగా, పరిశీలిస్తామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు సభ్యడు అనిల్ చౌదరి తెలిపారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్‌ రోడ్లు నిర్మించాలని సీఎం సూచించగా, పరిగణనలోకి తీసుకుంటామని అనిల్ చౌదరి తెలిపారు.

ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ-నాగ్ పూర్ కారిడార్ రహదారులకు అటవీ భూముల బదలాయింపు సమస్యగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వివిధ శాఖ‌ల ప‌రిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్​హెచ్ఏఐతో సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారు.

హైదరాబాద్ -మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాల‌ని అధికారులకు రేవంత్ సూచించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణకు భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టుల సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు.

జాతీయ రహదారుల విస్తరణ వివరాలు నెలాఖరులోగా సమర్పించండి - కలెక్టర్లకు సీఎం ఆదేశం - CM Revanth Review on Highways

ABOUT THE AUTHOR

...view details