తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఎలా? - అధికారులతో చర్చించిన సీఎం రేవంత్ - CM REVANTH REVIEW ON SAND SUPPLY

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష - ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఖనిజ విధానంపై అధ్యయనం కోసం నలుగురితో కమిటీ

CM Revanth Review On Sand Supply
CM Revanth Review On Sand Supply (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 11:59 AM IST

CM Revanth Review On Sand Supply :ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్​తో కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యయనం చేసి వారం రోజుల్లో విధివిధానాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టండి :రాష్ట్రంలో ప్రతీ ఏటా నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ప్రజలు మాత్రం ఎక్కువ ధ‌ర‌కు ఇసుకను కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌ని వివరించారు. ప్రజలకు త‌క్కువ ధ‌ర‌కే ఇసుక ద‌క్కేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్గాలు చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ఇసుక మాఫియాను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చర్యలు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మేజర్​, మైనర్​ ఖనిజ విధానంపై సమగ్ర నివేదిక :మేజ‌ర్‌, మైన‌ర్ ఖ‌నిజాల గ‌నుల‌కు వేసిన జ‌రిమానాలు ఎందుకు వ‌సూలు కావడం లేదని అధికారుల‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేజ‌ర్‌, మైన‌ర్ ఖ‌నిజ విధానంపై స‌మ‌గ్ర అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని క‌మిటీని ఆయన ఆదేశించారు. సమీక్షలో గృహ‌నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ఉన్నతాధికారులు వి.శేషాద్రి, మాణిక్ రాజ్ పాల్గొన్నారు.

మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు మరో కొత్త రేషన్​కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు రిపబ్లిక్​ దినోత్సవం రోజైన జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ప్రారంభించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హామీలను నెరవేర్చినట్లుగా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

పేదలంతా ఎక్కడున్నా రేషన్ కార్డు తీసుకోండి - త్వరలోనే సన్నబియ్యం : సీఎం రేవంత్ రెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్ - నెలాఖరులోగా మంజూరు

ABOUT THE AUTHOR

...view details