తెలంగాణ

telangana

ETV Bharat / state

పెండింగ్ ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష- పాలమూరు ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు - REVANTH REVIEW ON PALAMURU PROJECTS - REVANTH REVIEW ON PALAMURU PROJECTS

CM Revanth Focus On Projects In Palamuru : పాలమూరు జిల్లా పేరుచెప్తే గుర్తుకొచ్చేవి వలసలు, పెండింగ్ ప్రాజెక్టులే. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా దశాబ్దాలుగా పూర్తికాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై పలుమార్లు జిల్లా మంత్రులు, ఇంఛార్జ్​ మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

Govt Focus On Irrigation projects in palamuru
Govt Focus On Irrigation projects in palamuru (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:25 AM IST

Updated : Jul 9, 2024, 8:53 AM IST

Govt Focus On Irrigation Projects In Palamuru :ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అసంపూర్తిగా ఉన్న పాతప్రాజెక్టులు సహా ఇటీవలే మొదలై పూర్తికాని పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతజిల్లా కావడంతో ఇప్పటికే ఆయన కొడంగల్ ప్రజలకిచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం డీపీఆర్ రూపకల్పన, సర్వే కొనసాగుతున్నాయి.

పాలమూరు జిల్లా సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు :ఉమ్మడి పాలమూరు సహా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండపూర్ జలాశయాల పనులు 60 శాతం పూర్తయ్యాయి.

సాగునీరందించేందుకు కసరత్తు :కాలువలు, సొరంగ మార్గాలు, పంప్ హౌజ్‌ల పనులు 40 నుంచి 50శాతం వరకూ పూర్తయ్యాయి. ఒక్క మోటారులో శ్రీశైలం జలాశయం నుంచి నార్లాపూర్ జలాశయానికి ప్రస్తుతం నీళ్లెత్తి పోయొచ్చు. మిగిలినవన్నీ అసంపూర్తిగానే మిగిలాయి. ఇప్పటి వరకు లక్ష్మీదేవిపల్లి జలాశయం పనులే ప్రారంభంకాలేదు. ఉదండపూర్ జలాశయం కింద పునరావాసం కల్పించడంపై దృష్టిసారించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఇప్పటికే ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ముఖమంత్రి రేవంత్ రెడ్డి సైతం పాలమూరు రంగారెడ్డే ప్రధాన ఎజెండాగా మహబూబ్ నగర్ లో సమీక్ష చేపట్టనున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కోయల్ , భీమా, తుమ్మిళ్ల, గట్టుఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పరిధిలో వానాకాలంలో చివరి ఆయకట్టు వరకూ నీరందడం లేదు. ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గానికి 4 లేదా 5 టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే మంత్రులు అధికారులను ఆదేశించారు.

నెట్టెంపాడు పథకం కింద పనులు పూర్తి కాకపోవడంతో 2లక్షల ఎకరాలకు గాను ప్రస్తుతం 50 నుంచి లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. నెట్టెంపాడు కింద ర్యాలంపాడు జలాశయానికి అనుబంధంగా నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదు. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నా రెండో పంటకు నీళ్లందడం గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జూరాల, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాల కింద జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Koilsagar Project Present Status :కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం ఆయకట్టును 50వేల ఎకరాలకు పెంచుతూ పనులు చేపట్టినా30వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద ఉన్న శంకర సముద్రం పునరావాస సమస్య కొలిక్కిరాలేదు. మక్తల్ నియోజక వర్గంలో 9 ముంపు గ్రామాల సమస్యలు అపరిష్కతంగా మిగిలాయి. దేవరకద్ర నియోజక వర్గంలో కరివెన జలాశయం నుంచి కాల్వలు నిర్మాణం చేపట్టలేదు. ఇవి కాకుండా మిని ఎత్తిపోతల పథకాలు, రోడ్ కమ్ చెక్ డ్యాంలు, కాల్వల పూడిక తీత, మరమ్మతులు, ఆయకట్టు స్థిరీకరణ ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

గట్టు ఎత్తిపోతల పథకం రేలం పాడు రిజర్వాయర్ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతోనే జరుగుతోంది. దానిని నాలుగు టీఎంసీలకు మార్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాను. దీని వల్ల ఈ ప్రాంతంలో ఒకటి రెండు సంవత్సరాలు కరవు వచ్చినా అలంపూర్ గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లాలో ఆరులక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుంది.

-శ్రీహరి, మక్తల్ శాసనసభ్యుడు

సీఎంకు నివేదిక సమర్పించనున్న అధికారులు :ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనల మేరకు పాలమూరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. ప్రాజెక్టుల పూర్తికి ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్న నిధుల కొరత, భూసేకరణ, పునరావాస కల్పన అంశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం మాదిరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల ప్రాజెక్టులపై ఏం నిర్ణయం తీసుకుంటారో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

లక్ష్యానికి ఆమడ దూరంలో సాగునీటి ప్రాజెక్టులు - భూసేకరణే ప్రధాన అడ్డంకి

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.58 వేల కోట్లు అవసరం - కాళేశ్వరానికి కావాల్సింది రూ.17,852 కోట్లు

Last Updated : Jul 9, 2024, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details