Saif Ali Khan Attack : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు చివరిసారిగా బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడని పోలీసులు తెలిపారు. సైఫ్‌పై దాడి తర్వాత ఆ వ్యక్తి గురువారం ఉదయం లోకల్ ట్రైన్లో వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఆ వ్యక్తి దొరికాడు!
విచారణ కోసం శుక్రవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తికి, సైఫ్ అలీఖాన్ దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
Saif Ali Khan Attack Case | The person brought to Bandra police station for questioning is not related to the Saif Ali Khan Attack Case. No one is detained in Saif Ali Khan Attack Case of now: Mumbai police https://t.co/1pZBX0rgl2 pic.twitter.com/vG8WnpTauk
— ANI (@ANI) January 17, 2025
హెక్సా బ్లేడ్ స్వాధీనం
మరోవైపు, సైఫ్ అలీఖాన్ వెన్నెముకలో ఇరుక్కున్న హెక్సా బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో సైఫ్ అలీఖాన్ ఇంటివద్ద పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించడానికి ముంబయిలోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించామని వెల్లడించారు. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఆయన అపార్ట్మెంట్ సమీపంలో ఎన్ని మొబైల్ ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నాయో వంటి విషయాలను క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సేకరించారని అన్నారు.
30 గంటలైనా ఇంకా దొరకని నిందితుడి ఆచూకీ!
కాగా, సైఫ్ పై దాడి జరిగి 30 గంటలకు పైగా గడిచాయి. 20పోలీసు బృందాలు నిర్విరామంగా పనిచేసినా నిందితుడి ఆచూకీ ఇప్పటివరకు కనిపెట్టలేకపోయాయి. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి అనంతరం దుండగుడు మెట్ల మీదుగా పారిపోయినట్లు గుర్తించారు. గురువారం రాత్రి 2.33 గంటల సమయంలో ఆరో అంతస్తులోని మెట్లవద్ద నిందితుడి చిత్రాలు లభించాయి.
అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గురువారం రాత్రి దాడి జరిగింది. ముంబయిలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సైఫ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. అయితే సైఫ్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు ఎప్పుడు తరలించాలన్న విషయంపై ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు నిర్ణయం తీసుకుంటారని లీలావతి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కేర్‌టేకర్‌ను బెదిరించి చేసి రూ. కోటి డిమాండ్! - సైఫ్‌పై అటాక్‌కు అదే కారణమా?