CM Revanth Requests To PM Modi :రాష్ట్రానికి రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వినతిపత్రం ఇచ్చారు. కేంద్రంతో ఘర్షణ పడబోమని సీఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని బహిరంగంగా వెల్లడించిన సీఎం, పలు అంశాల్లో సహకరించాలని ప్రధానిని కోరారు.
ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా గత ప్రభుత్వం 1600 మెగా వాట్లు మాత్రమే సాధించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మిగిలిన 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ (Musi River Beautification Hyderabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
CM Revanth Request To Modi On Metro Expansion :మరోవైపు తుమ్మిడిహట్టి ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్న సీఎం, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం 2022–23 లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి 3 కోట్లు మంజూరు చేసిందని, 7 వేల 700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని విన్నవించారు.
క్యా సీన్ హై! - ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, రేవంత్‌ల మధ్య సరదా సంభాషణ
"రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించండి. సుమారు 10లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. తెలంగాణలో పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్‌ను అత్యవసరంగా సమీక్షించండి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మరో 29 పోస్టులను ఇవ్వాలి." అని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి (CM Revanth Petition To PM Modi) కోరారు.
హైదరాబాద్ – రామగుండం, హైదరాబాద్ –నాగ్‌పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలతో పాటు 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణం కోసం పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో 1038 ఎకరాల ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లీజు గడువు ముగిసినందున పునరుద్ధరించాలన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున హైదరాబాద్‌లో ఐఐఎం (IIM Hyderabad) ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ప్రధానికి వివరించారు.
"నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద కేంద్ర వాటాగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 347కోట్ల 54 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలి. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ నాలుగులైన్లు, జడ్చర్ల–మరికల్ నాలుగు లైన్లు, మరికల్–డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి" అని తన వినతిపత్రంలో సీఎం రేవంత్ ప్రధాని మోదీని కోరారు.
వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నా - అందుకే వారికి భయం పట్టుకుంది : మోదీ
రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ