CM Revanth Meet with World Bank President Ajay Banga :రాష్ట్రంలో పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం, ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైంది. చర్చల్లో భాగంగా హైదరాబాద్ 4.O అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అజయ్ బంగాను కోరింది. మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు.
అంతకముందు వివిధ ఫార్మా కంపెనీలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి బృందం, ప్రధాన పెట్టుబడులను ఆకర్షిస్తూ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ మేరకు ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకే పలు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ఈ క్రమంలోనే వివింట్ ఫార్మా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. రూ.400 కోట్లతో వివింట్ ఫార్మా విస్తరణకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఇంజక్షన్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
Pharma Glass Tubes Manufacturing Center : రాష్ట్రానికి ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం రానుంది. మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, పరిశ్రమలశాఖల మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు.