CM Revanth Reddy Slams On BRS Party Over Rajiv Statue Issue : తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. 'రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్ గాంధీ. 72, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారు’ అని తెలిపారు.
"దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది ఆయనే, స్థానిక సంస్థల్లో రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ మహిళలంతా కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. కానీ గత పాలకుల హయాంలో ఐదేళ్ల వ్యవధిలో కనీసం ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకా వాళ్లకు (బీఆర్ఎస్) ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందారు :త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రూ.వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు, స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి, స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నేత నెహ్రూ అని కొనియాడారు. ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదన్న సీఎం, కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందుతున్నారని పరోక్షంగా విపక్షాలను విమర్శించారు.