CM Revanth Reddy Visits Tirumala Temple :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ ఇవాళ ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకలను మొక్కుగా చెల్లించారు. అనంతరం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబానికి పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
దర్శనం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియోతో మాట్లాడారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణం, కల్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
గత సంవత్సరంలో వర్షాలు కురవకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో నీటి సమస్యలు తీరాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు.