CM To Give DSC Appointment Orders :రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమంలో దాదాపు పదివేల మందికిపైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం నియామక పత్రాలను అందించనున్నారు.
రాష్ట్రంలో కొలువుల పండుగ :రాష్ట్రంలో పెద్ద పండుగ విజయదశమికి ముందే కొలువుల పండుగ ప్రారంభమైంది. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా నూతనంగా ఎంపికైన సుమారు పది వేల మందికిపైగా ఉపాధ్యాయులు నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడయంలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16వేల కానిస్టేబుల్ పోస్టులు నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయటంతో పాటు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి గ్రూప్స్ పరీక్షలను సైతం నిర్వహించింది.
ప్రస్తుతం ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతుండగా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీని ప్రకటించారు. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన సర్కారు కేవలం ఏడు నెలల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ రోజు దాదాపు పది వేల మందికి పైగా నియామకపత్రాలను అందించనున్నారు.
ఏయే పోస్టులకు ఎంతమంది ఎంపికయ్యారంటే :ఈ ఏడాది ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2లక్షల 46వేల మంది పరీక్షలు రాశారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. అయితే ఈ సారి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోకుండా చూడాలని భావించిన సర్కారు ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించింది.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో పోస్టును మాత్రమే కేటాయిస్తూ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారిని ప్రకటించింది. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల ఫలితాలను ప్రకటించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,515 స్కూల్ అసిస్టెంట్, 685 భాషా పండితులు.. 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేషన్, 281 ఎస్జీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారికి మంగళవారం సాయంత్రానికే జిల్లాల వారీగా సమాచారం అందించారు.
అపాయింట్మెంట్ లెటర్లు అందుకోనున్న 10,006 మంది :ఎల్బీ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో మొత్తం 10వేల మందికి పైగా నియామకపత్రాలను అందుకోనున్నారు. అభ్యర్థులను జిల్లాల నుంచి ఎల్బీ స్టేడియంకి తరలించే బాధ్యతను జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లకు అప్పగించారు. పండుగకు ముందే నియామకపత్రాలు అందిస్తామని పలు మార్లు ప్రకటించిన సర్కారు అన్నట్టుగానే ఉపాధ్యాయ ఖాళీల భర్తీని పూర్తి చేసి నియామక పత్రాలు అందించటం పట్ల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
700 మంది AEEలకు నేడు నియామక పత్రాలు - కొత్తగా 1800 లష్కర్ పోస్టుల భర్తీకి సీఎం ప్రకటన! - CM Revanth AEE Appointments orders
రైతులు, విద్యార్థులే మా ప్రాధాన్యత - త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీ : రేవంత్ రెడ్డి - CM Revanth comments on recruitment