CM Revanth on Mahabubnagar Majority for Congress :మహబూబ్‌నగర్ పార్లమెంటు ఫలితాలపై ఆ నియోజకవర్గ నాయకులతో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గెలవడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడంగల్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గాలల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఓట్లు వచ్చినప్పటికీ మిగిలిన నాలుగు నియోజకవర్గాలల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ అభ్యర్ధి డీకే ఆరుణ విజయం సాధించారు.
నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు వచ్చిన ఓట్ల సంఖ్యను పరిశీలించినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గడం, బీజేపీకి అధికంగా రావడం ఎలా సాధ్యమైందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాలపై త్వరలోనే సీఎం రేవంత్ ఆ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించి ఎక్కడ తప్పిదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు.
CM Revanth on Mahabubnagar MP Candidate Defeat :తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు చెందిన మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. పైగా ఆ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వాళ్లే. కచ్చితంగా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం తమ పార్టీదేనని అంచనా వేసిన హస్తం నేతలు షాక్‌కు గురయ్యారు. ఆ నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ నేతలను నిరాశ పరిచాయి.