Kharif Grain Collection in Telangana :రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్, ఇంఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న వారం, పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ, ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేసిన వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇంఛార్జ్ మంత్రులను ఆదేశించారు.
సీఎస్ సమీక్ష : ఈ సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గోదాములకు ధాన్యం రవాణా చేయాలని, త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు, వరి, పత్తి కొనుగోలులో పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే తదితర ప్రధాన అంశాలపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.