CM Revanth Meeting With Ministers :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రం పంపిన విజ్ఞప్తులు, కేంద్రం ఇచ్చిన నిధుల వత్యాసంపై మంత్రులు, ఆర్థికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వారితో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలకు కేంద్రం కేటాయింపులు, రాష్ట్రాల వాటా, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ సాగింది. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం, లాభనష్టాలపై కూడా మంత్రివర్గం సమీక్షించింది.
సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ రిజర్వేషన్లు, కులగణన అంశాలను చర్చించినట్లుగా తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ త్వరలో ఇచ్చే నివేదిక ఇస్తుందని ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం : కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం రేపు, ఎల్లుండి సమావేశం కానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కులగణనపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే సమయంలో బీఆర్‌ఎస్ కూడా సహకరించాలని అన్నారు.