CM Revanth Reply to AP CM Chandrababu Letter : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న జ్యోతిరావు ఫులే ప్రజాభవన్ వేదికగా కలిసి చర్చిద్దామని తెలిపారు. విభజన సమస్యల పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చించాలన్న చంద్రబాబు సూచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం అవసరమని, వాటిపై కలిసి కూలంకషంగా చర్చిద్దామని సీఎం రేవంత్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు లేఖలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం అవసరం : స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఒకరిగా చంద్రబాబు చేరారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా చంద్రబాబు ఈ విడతలో విజయవంతం కావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగురాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమన్న ఆయన, చర్చలే పరస్పర సహకారానికి గట్టి పునాది వేస్తాయని వ్యాఖ్యానించారు. విభజన చట్టానికి సంబంధించిన అంశాల పరిష్కారం అత్యవసరమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మరింత సేవలు అందించేందుకు, పరస్పర ఆలోచనలు పంచుకొని సహకరించుకునేందుకు ముఖాముఖి సమావేశం తప్పనిసరి అవసరం అని సీఎం అన్నారు.