CM Revanth Reddy On Congress Assurances : ప్రభుత్వం, పార్టీ జోడెద్దులుగా సాగాలనే ఉద్దేశంతో అధిష్ఠానం బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నూతన పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ బాధ్యతల స్వీకరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ హామీలపై స్పష్టమైన ప్రకటనలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, అందరికి న్యాయం చేస్తామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న రేవంత్‌రెడ్డి, ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగ ప్రకటనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే 65వేల నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.
"రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పార్టీ నేత రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఆనాడే దైవం సాక్షిగా చెప్పినా, పంద్రాగస్ట్ లోపల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని మాట ఇచ్చాను. పార్లమెంట్లో 42 శాతం ఓట్లు, 8 ఎంపీ సీట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఇప్పడు రాజీనామా చేస్తానన్న ఆ వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Fires On BRS Party :కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన రేవంత్, మా ఇంటికి వస్తామని బెదిరిస్తే, మావారే వెళ్లి వారి పనిపట్టారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే, ఆయన వెనుక నేనున్నానన్న విషయం మరచిపోవద్దని స్పష్టం చేశారు.