CM Revanth Reddy Participated in Book Inauguration :అధికారులు ఎంత నిబద్ధత చూపితే పథకాలు అంత విజయవంతమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన "లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి - మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్" పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని అన్నారు. కానీ, ఇప్పటి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ గదుల వీడేందుకు ఇష్ట పడట్లేదని తెలిపారు.
మనకున్న జ్ఞానం, అధికారం పేదలకు ఉపయోగపడాలి :బద్ధత కలిగిన అధికారులను గుర్తించి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా అమలు చేసేది అధికారులేనని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పని చేసిన వారిని ప్రజలూ గుర్తుంచుకుంటారని, మనకున్న జ్ఞానం, అధికారం పేదలకు ఉపయోగపడాలని అన్నారు. సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నత అధికారులు ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.