CM Revanth Reddy on Irrigation Projects : అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగుతోంది. నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయాలు చెప్పాయని, ఇతరులు ఇచ్చే నివేదికను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఐదుగురు ఇంజినీర్ల కమిటీ ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
'తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వ తప్పులు ఒప్పుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. తప్పులు ఒప్పుకుని సలహాలు ఇస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేది. తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు. మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారని' రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వం దోచుకున్నది దాచుకోవడం పైనే దృష్టి పెట్టింది : సీఎం రేవంత్ రెడ్డి
Telangana Assembly Sessions 2024 : మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 2012లో ఒప్పందం జరిగిందని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణ అడ్డంకులు తొలగించేందుకు చర్చలు జరిగాయని తెలిపారు. అంతర్రాష్ట్ర బోర్డు, స్టాండింగ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు జరిగిందని వివరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు చర్చించారని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి 152 మీటర్ల వద్ద కడితే మహారాష్ట్రలో 1850 ఎకరాలు ముంపునకు గురవుతుందని, అదే తుమ్మిడిహట్టి 150 మీటర్ల వద్ద కడితే మహారాష్ట్రలో 1250 ఎకరాలు ముంపునకు గురవుతుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.