CM Revanth Reddy on HYDRA: హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్‌వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్ ఓఆర్‌ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు.
హైదరాబాద్‌లో సరస్సులు మాయమవుతున్నాయని నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రూ.6వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తిశాఖ మంత్రికి ఇచ్చామన్నారు. గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేదని ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా అని ప్రశ్నించారు. పబ్బు, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్లపై చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తమకు అందరి జాతకాలు తెలుసని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Minister Ponnam On HYDRA: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా హైడ్రాకి అంకురార్పణ చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో ఉన్న కోటి 25 లక్షల జనాభాకు అనుగుణంగా ముఖ్యమంత్రి 3 అంశాలను తీసుకున్నట్లు వివరించారు. హైడ్రాకి చెంది ఏం సలహాలు ఇచ్చిన స్వీకరిస్తామని తెలిపారు. బీజేపీ సభ్యులు హైదారాబాద్ నగరానికి కేంద్రం నుంచి తెచ్చే నిధులు అంశంపై కూడా మాట్లాడాలని పిలుపునిచ్చారు.