CM Revanth Reddy on Future Plan for Drinking Water : హైదరాబాద్ మహానగరంలో తాగునీటి అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2050 నాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. జలమండలి బోర్డు ఛైర్మన్ హోదాలో తొలిసారిగా జలమండలి అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శలు దానకిషోర్, రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సహా సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం నగరంలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డిమాండ్, జలమండలి ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9 వేల 800 కిలో మీటర్ల నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఏంకు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు తీసుకొచ్చే ప్రాజెక్టు రూపకల్పన జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. అయితే ఆ ప్రాజెక్టు కోసం మల్లన్నసాగర్ లేక కొండపోచమ్మ సాగర్‌ను నీటి వనరుగా ఎంచుకునే అంశంపై సీఎంతో అధికారులు చర్చించారు.