CM Revanth Reddy Meeting with Governor Radhakrishnan : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌తో 2 గంటల పాటు భేటీ అయ్యారు. గవర్నర్‌తో లంచ్‌కు భేటీ అయిన సీఎం, రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి మండలి విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, 2.55 గంటల వరకు గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల దగ్గర నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఐదు రోజుల పాటు దిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశం కావడం, అది కూడా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.