Pocharam Joins Congress Party :బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పోచారాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం పట్ల పోచారం సానుకూలంగా స్పందించడంతో, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. పోచారం సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చామని చెప్పారు. పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
పోచారం స్పందన.. రాష్ట్రం కోసం రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆయనకు మద్దతుగా నిలిచేందుకే కాంగ్రెస్‌లో చేరినట్టు పోచారం తెలిపారు. రైతుల కోసం వారు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులపై ఆయన తీసుకున్న నిర్ణయాలు సమర్థనీయమన్నారు. రేవంత్ నాయకత్వంలో మరింత కష్టపడి పని చేస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి (ETV Bharat) "తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశాము. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తాం. "- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
చేరికలపై మరంత ఫోకస్.. బీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే వారిని పార్టీలో చేర్చుకోవాలని భావించినా, ఏఐసీసీ అనుమతితో పాటు వివిధ కారణాలతో ఆ దిశగా పీసీసీ ముందడుగు వేయలేదు. సార్వత్రిక ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుస్తామని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేసినా, ఆశించిన మేర ఫలితాలు రాలేదు.
బీజేపీ ధీటుగా సీట్లు సాధించటంతో, పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కీలక నేతలు, ఈ చేరికలపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా 20మంది వరకు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, పోచారాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటం, వరుస వైఫల్యాలతో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే జరిగితే బీజేపీ బలోపేతమయ్యే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సమీక్షల పేరుతో ప్రభుత్వం సమయాన్ని వృథా చేస్తోంది: పోచారం శ్రీనివాస్ రెడ్డి
పుట్టిన రోజు నాడు కంటతడి పెట్టిన పోచారం