CM Revanth Reddy on Group 1 Exam Ratio : నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలవాలని కొందరు అంటున్నారని తెలిపారు. ఈ నిష్పత్తిలో పిలిస్తే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టత ఇచ్చారు. కానీ నోటిఫికేషన్లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు. కొంతమంది చెప్పినట్లు 1:100 పిలిస్తే మళ్లీ గ్రూప్-1 మొదటికి వస్తుందని వివరించారు. జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, గ్రూపు-1, డీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ముందుకువెళ్తున్నామని వివరించారు. రెండేళ్ల క్రితం డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. కానీ కొందరు డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష విధానం, సిలబస్ మార్చలేదు అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన సమయానికి పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులకు ఇబ్బందులు వస్తాయని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వారికే ఇబ్బందులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పరీక్షలు రాయనివారు నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదాలు వేయాలని కోరుతున్నారని విమర్శించారు. మార్చి 31లోపు ఖాళీలు తెప్పించి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 9లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకోస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.