SLBC Tunnel Accident Latest news :శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ప్రభుత్వ యంత్రాంగమంతా చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన వెంటనే నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌ను హెలికాప్టర్‌లో అక్కడికి పంపిన సీఎం, రాత్రి వారు హైదరాబాద్‌కు తిరిగొచ్చాక పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే SDRF, తోపాటు NDRF బృందాలను ఘటన స్థలానికి పంపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆదిత్యనాథ్‌దాస్‌తో సీఎం శనివారం రాత్రి సమావేశమై వివరంగా చర్చించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు వివరించారు.
ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపడుతున్నాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన సాయం అందించాలని ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని సీఎం సూచించారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించే చర్యల్లో వేగం పెంచాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రమాదానంతర పరిస్థితులను సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సంబంధిత అధికారులందరితోనూ సమావేశమై అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.
సీఎం రేవంత్‌కు ఫోన్ చేసిన ప్రధాని : ప్రధాన మంత్రి మోదీ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద పూర్వాపరాలను, సహాయచర్యల తీరును సీఎం ప్రధానికి వివరించారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని సీఎంకు చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కూడా ఆరా తీసింది. ఘటనపై నివేదిక పంపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరినట్లు తెలిసింది.
ఎక్స్‌లో రాహుల్ ట్వీట్ :ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గంలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొరంగం పైకప్పు కూలడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రమాదంలో చిక్కుకున్న వారు, వారి కుటుంబసభ్యుల క్షేమం గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు. బాధితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు స్పందన బృందాలు అన్ని రకాల చర్యలూ చేపట్టాయని పేర్కొన్నారు.