CM Revanth Reddy Fires on KCR at Bhadrachalam :డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టిన ఆయన, బీఆర్ఎస్ పార్టీపై(BRS Party) తీవ్రంగా విరుచుకుపడ్డారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించిన సీఎం, బడుగువర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తాయని కొనియాడారు.
పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ ఇళ్లు ప్రారంభించారని పేర్కొన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లే, గృహ నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులకు(Beneficiaries) మంజూరు పత్రాలను సీఎం అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు వల్ల పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
"ఇవాళ కేసీఆర్‌కు సూటిగా నేను సవాల్ విసురుతున్నాను. డబుల్ బెడ్రూం ఇచ్చినా, దళితులను ఆదుకున్నా అని చెప్పుకొచ్చిన కేసీఆర్, నువ్వు ఎక్కడైతే సంక్షేమం అందించావో అక్కడే ఓట్లు అడగి వేయించుకోవాలి. ఏ ఊళ్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేము ఓట్లు అడుగుతాం. ఈ సవాల్‌కు సిద్ధమా అని కేసీఆర్‌ను నేను అడుగుతున్నాను."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Launch Indiramma Housing Scheme Today : తమ పాలనలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రధాని చెప్పారన్న ఆయన, ఆ పథకం ద్వారా తెలంగాణలో ఎక్కడ ఇళ్లు కట్టారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై తుపాకీలు ఎక్కుపెడుతున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని, భర్తీలే కానీ పూరించివుంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండదు కదా అని ప్రశ్నించారు.