CM Revanth Distribute Teacher Job Appointments Letters :డీఎస్సీ విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు అనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలి దానాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయిందని విమర్శించారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. టీచర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
నియామక పత్రాలు పంపిణీకి ముందు సీఎం మాట్లాడుతూ, 'గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పాను. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు ఇచ్చాం. డీఎస్సీ ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రబుత్వ పాఠశాలల పాత్ర కీలకం. గతంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది సమస్యలు పరిష్కరించాం.' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తాం. రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీర్లు పట్టాలు పొందుతున్నారు. నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీను ప్రారంభించాం. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందిస్తున్నాం. ఒలింపిక్స్‌లో దేశం పరిస్థితి ఏంటో చూశాం. 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాకు ఒలింపిక్స్‌లో 32 పతకాలు వచ్చాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఎందుకు పతకాలు రాలేదు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి