CM Revanth Emergency Review :రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా మంత్రులు, అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొని ఆదేశాలు ఇస్తున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలాయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు తెరిచారు.
85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. వివిధ జిల్లాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 2 వేల 500 మందిని తరలించినట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చిన వాటిని కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి పంపించాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, ఎలాంటి అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ చేయాలని చెప్పారు.
మంత్రి భట్టి సమీక్ష : ఖమ్మం నుంచి సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు కలిగితే, వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని చెప్పారు. ఖమ్మంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన భట్టి సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరాలపై అంతరాయాలకు 1912 కాల్ చేయాలని తెలిపారు.