Basavatarakam Indo American Cancer Hospital 24th Anniversary : బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
CM Revanth Reddy Speech at Basavatarakam Hospital : శంషాబాద్లో 500-1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబులాగా 18 గంటలు పని చేయాలి : చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.