CM Revanth On Remarks Over Kavitha Bail :తనకు భారత న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవం, విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించేలా పత్రికల్లో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవముందని దాన్ని అలాగే కొనసాగిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
'నా వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగాన్ని, దాని విలువలను విశ్వసించే నేను, ఎన్నటికీ న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటాను' - సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
ఇదీ జరిగింది :దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'సీఎం ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయపార్టీలను సంప్రదించో లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?’ అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు.
రేవంత్ ఏమన్నారంటే ? కవితకు 5 నెలల్లోనే బెయిల్ రావడంతో చర్చ జరుగుతోందని ఇటీవల జరిగిన ఓ చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదని వివరించారు. మనీశ్ సిసోదియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదని ఆయన గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
బాధ్యత కలిగిన సీఎంగా చేయాల్సిన వ్యాఖ్యలేనా? - రేవంత్ రెడ్డిపై సుప్రీం ఫైర్ - Supreme Court Fires on CM Revanth