Compensation For Police Martyrs in Telangana :దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయంటే పోలీసులే కారణమని తెలిపారు. అమరులైన కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. అమరులైన ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామని తెలిపారు.
శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేందుకు శాంతిభద్రతలే కీలకమని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, శాంతిభద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమని వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పోలీసుల ఫ్లాగ్‌డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోలీసులకు అండగా ప్రభుత్వం : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అమరుల కుటుంబాలను ఆదుకుంటామనే నమ్మకం కలిగిస్తుందని అన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారని, నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారని వ్యాఖ్యానించారు.