SC ST Sub Classification : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని తెలిపింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును పలువురు రాజకీయ నేతలు స్వాగతిస్తున్నాయి.
CM Revanth OnSC ST Sub Classification : ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 27 ఏళ్లుగా మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు పోరాటం సాగించారని సీఎం అన్నారు. ఉపవర్గీకరణ కోసం తాను, సంపత్ వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. అప్పుడు సభ నుంచి తమను బహిష్కరించారని, గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మోసం చేసిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
"దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను’’ - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి