CM Revanth Reddy about Women in Mahila Sadassu : కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తమదని, ఆడబిడ్డలను ధనవంతులుగా చేస్తే తెలంగాణ కూడా ధనిక రాష్ట్రం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రానున్న అయిదేళ్లలో మహిళా సంఘాల్లోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపేతం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే అయిదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు.
మహిళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు ప్రభుత్వం తోడ్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. స్వయం సహాయక సంఘాలను ఐఐటీ, ఐఐఎం, ఎస్బీఐ, ఆర్ఎంఏతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళ సదస్సులో పాల్గొన్న ఆయన మహిళా సంఘాల సూక్మ వ్యాపార ప్రణాళికల అధ్యయనం, రుణాల సిఫార్సుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వివరించారు. వచ్చే నెల రోజుల్లో శిల్పారామం పక్కన 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
CM Revanth Reddy about Mahila Shakti Scheme : ప్రతి నియోజకవర్గంలో మినీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటునకు ప్రతిపాదన తెస్తామని, మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాలు, జీవిత బీమా కల్పనకు అమలు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల్లోని 63.86 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల జీవిత బీమా ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా మహిళా సంఘాలకు నిర్వహణ అప్పగిస్తామని చెప్పారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లవి చీకటి ఒప్పందాలని సీఎం విమర్శించారు. మహిళల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న రేవంత్ రెడ్డి, అలాంటి వారు పల్లెల్లోకి వస్తే మహిళలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పు తనపై రుద్దారన్న ఆయన, ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కో పథకం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.