తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామంలో రేవంత్​ పర్యటన - ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

ముఖ్యమంత్రి రాకతో మురిసిన కొండారెడ్డిపల్లి - స్వగ్రామంలో దసరా సంబురాల్లో పాల్గొన్న రేవంత్​రెడ్డి - పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

CM Revanth Participate Dussehra Celebrations in kondareddypally
CM Revanth Participate Dussehra Celebrations (ETV Bharat)

CM Revanth Participate Dussehra Celebrations in kondareddypally : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్​రెడ్డి.. స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం కొండారెడ్డి పల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రథసారథికి స్థానికులు పూల జల్లులు, డప్పు దరువులు, కోలాటాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. బతుకమ్మలు, బోనాలు, గజమాలతో దారి పొడవునా జై రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధి ప్రదాతకు గ్రామ వీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించి సాదరస్వాగతం పలికారు.

అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు . రూ.64 లక్షలతో మోడ్రన్‌ బస్టాండ్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు భూమిపూజ చేశారు. రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని జాతికి అంకితం చేశారు. రూ.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనుల్లో పాల్గొన్న అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.

సొంతూరి వారందరినీ పేరుపేరున పలకరించిన ముఖ్యమంత్రి : గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామశివారులోని జమ్మి చెట్టు దగ్గర కుటుంబంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన స్థానికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సొంతూరి వారందరినీ పేరుపేరున ముఖ్యమంత్రి పలకరించడంతో స్థానికులు ఎంతగానో ఆనందించారు. రాష్ట్రప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలు, పాడిపంటలతో తులతూగాలని దేవుడిని సీఎం ప్రార్థించారు.

ముఖ్యమంత్రి రాకతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వెంట నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్​, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్​ రెడ్డి, స్థానిక ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

'ప్రైవేట్ స్కూళ్లలో మీకంటే అనుభవజ్ఞులు ఉన్నారా ?' - డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్

'60 రోజుల్లో బీసీ కుల గణన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం - ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు'

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details