CM Revanth Reddy On Young India Skill University :నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ'ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతోపాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమావేశమయ్యారు.
స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు :స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలతోపాటు భవిష్యత్తు ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా యూనివర్సిటీ బోర్డుతో, రాష్ట్రంలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో పంచుకున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
స్కిల్ యూనివర్సిటీ బాధ్యతలు ఆనంద్ మహీంద్రాకు :రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు. స్కిల్ యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్‌కు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమ ఆలోచనలను వీలైనంత వేగంగా ఆచరణలోకి తెచ్చామని, ఈ రంగంలో అనుభవంతోపాటు ప్రత్యేక గుర్తింపు కలిగిన మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే విశ్వాసం తమకుందన్నారు.
200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనిర్శిటీ :తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని రేవంత్ వెల్లడించారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామన్నారు. ఆ యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని రూ.3 లక్షల కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
నైపుణ్యవంతమైన మానవవనరుల కొరత ఉంది :ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ చూపాలని తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని కోరారు. డిగ్రీలు, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఉద్యోగం ఇప్పించాలని తన వద్దకు వస్తున్నారని తనకు ఎదురైన కొన్ని అనుభవాలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు మానవ వనరుల కొరత ఉందని, దానిని తొలిగించేందుకు స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఐటీ శాఖ మంత్రి వివరణ : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని, అందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభం కావటం ఆనందంగా ఉందన్నారు.