తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించి జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం: సీఎం రేవంత్​ - CM Revanth ON Job Calendar - CM REVANTH ON JOB CALENDAR

CM review On Demands of the unemployed : ఉద్యోగాల భర్తీపై తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావద్దని కోరారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్లపై పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో చర్చించారు.

CM review On Demands of the unemployed
CM review On Demands of the unemployed (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 10:01 PM IST

Updated : Jul 5, 2024, 11:08 PM IST

CM Review On Demands Of The Unemployed :అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్ల విషయంపై ఆయన పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో చర్చించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. పరీక్షల సమయంలో నిబంధనలు మారిస్తే తలెత్తే చట్టపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కోరారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 28,942 నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. పరీక్షల తేదీలపై టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ‌త ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని తెలిపారు.

అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష :గ్రూప్ వన్​లో 1 : 100 ప్రకారం మెయిన్స్​కు ఎంపిక గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల పెంపు వివిధ పరీక్షల మధ్య సమయం ఇవ్వడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులతో రేవంత్ రెడ్డి పలు అంశాలు చర్చించారు. మొదట పార్టీ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత సీఎస్, ఇతర అధికారులతో సమీక్షించారు.

గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, త‌ప్పుడు నిర్ణయాల వల్ల గ్రూప్ వన్ రెండు సార్లు వాయిదా ప‌డింద‌ని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పిటిష‌న్ వెన‌క్కి తీసుకొని పాత నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసి అద‌నంగా మ‌రిన్ని పోస్టుల‌తో కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు.

CM Revanth On Group-1 :నోటిఫికేష‌న్ ప్రకారం ప్రిలిమ్స్​లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున‌ మెయిన్స్​కు ఎంపిక జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని అదే జ‌రిగితే మొత్తం నోటిఫికేష‌న్ నిలిచిపోతుంద‌ని అధికారులు వివ‌రించారు. నోటిఫికేష‌న్‌లో ఉన్నట్లు బ‌యో మెట్రిక్ విధానం అమలు చేయలేదన్న ఏకైక కారణంతో రెండో సారి గ్రూప్​-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిందని సీఎంకు గుర్తు చేశారు.

యూపీఎస్‌సీ వ‌ర్సెస్ గౌర‌వ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవ‌కాశ‌మిస్తే ముందు ఉన్నవాళ్లకు అన్యాయం జ‌రిగిన‌ట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింద‌న్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంచాలన్న డిమాండ్ పై సమావేశంలో చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో పోస్టులు పెంచ‌టం కూడా నోటిఫికేష‌న్​ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని అధికారులు వివరించారు.

గ్రూప్​-1 కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచ‌టం సాధ్యమైందని, గ్రూప్- 2, గ్రూప్​-3 నోటిఫికేష‌న్లకు అలాంటి వెసులుబాటు లేద‌ని చెప్పారు. గ్రూప్ 2, డీఎస్సీ ప‌రీక్షలు ఒక‌దాని వెంటే ఒక‌టి ఉండ‌టంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి, యువజన నాయ‌కులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జులై 17నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు డీఎస్సీ పరీక్షలు ఆ తర్వాత వెంట‌నే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేష‌న్‌ కు ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు.

టీజీపీఎస్​సీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం :వరస పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖ‌తో చ‌ర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28 వేల 942 ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామ‌కాల‌కు ఉన్న కోర్టు చిక్కుల‌న్నింటిని అధిగ‌మించింద‌ని చెప్పారు.

జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భ‌ర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామ‌న్నారు. శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ నియామక బోర్డుల పరీక్షలకు ఆటంకాలు ఏర్పకుండా నిరుద్యోగుల‌కు పూర్తి న్యాయం జ‌రిగేలా క్యాలెండ‌ర్ రూపొందిస్తామ‌న్నారు. త‌మ ప్రభుత్వం నిరుద్యోగుల విష‌యంలో కీలక క‌స‌ర‌త్తు చేస్తుంటే కొంద‌రు రాజ‌కీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

గ్రూప్స్‌ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు - అరెస్ట్ చేసిన పోలీసులు - Students Strike in Telangana

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన - టీజీపీఎస్సీ ఆఫీస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు

Last Updated : Jul 5, 2024, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details