Cm Revanth Reddy On Family Digital Card :అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్స్ వేదికగా కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సీఎం ప్రయోగాత్మక పథకం కింద డిజిటల్ కార్డుల సమాచారం సేకరణ చేపట్టామని తెలిపారు.
ఒకే కార్టు పేరిట పైలెట్ ప్రాజెక్ట్ : పేద కుటుంబాలకు డిజిటల్ కార్డులు రక్షణ కవచమన్న సీఎం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రేషన్ కార్డు కోసం పదేళ్ల నుంచి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారన్న సీఎం మెరుగైన విధానంతో పరిపాలన సాగించేలా ఒకే రాష్ట్రం ఒకే కార్టు పేరిట పైలెట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానం రుపొదించామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పథకాల సమాచారంతో పాటు ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరుస్తామని సీఎం తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమస్యల ఆధారంగా ముందుకెళతామని ముఖ్యమంత్రి వివరించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే :పైలట్ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామం, పట్టణంలో ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తాహెర్ కొండాపూర్‌లో ఫ్యామిలి డిజిటల్ కార్డు సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ కోరారు.