CM Revanth Helps For Child Treatment :'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో ఈటీవీ భారత్ తెలంగాణలో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేలకు సీఎంవో సమాచారం అందించింది. బాబును శస్త్ర చికిత్స తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాధితులను పిలిపించి, బాబు వైద్యానికి ఏర్పాట్లు చేశారు.
ఇదీ బాబు సమస్య: హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన సిల్వేరు వెంకటేశ్ - అశ్విత దంపతుల ఏడాది వయసున్న కుమారుడు మహాన్ పుట్టిన నెల రోజులకే మెదడులో రక్తం గడ్డకట్టి అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తలకు కణతి ఏర్పడి పెద్దగా మారిపోయింది. చిన్నారి వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులు అప్పు చేసి మూడు శస్త్ర చికిత్సలు చేయించారు. అయినప్పటికీ కణతి పరిమాణం పెరిగిందే తప్పితే బాగు కాలేదు. మళ్లీ పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
CM Response Child Suffering Blood Clots In Brain :నిరుపేద కుటుంబం కావడంతో బాబు ఇంకా చికిత్స చేయించే స్థోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఈటీవీ భారత్‌తో తమ కష్టాలను చెప్పుకున్నారు. 'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో చిన్నారి పడుతున్న బాధను ఈటీవీ భారత్ కథనంగా ప్రచురించింది.
ఈ కథనంలో ఎవరైనా దాతలు సహాయం చేస్తే తమ కుమారిడిని కాపాడుకుంటామని బాబు తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ కథనం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి స్పందించి చిన్నారి చికిత్సకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారికి వచ్చిన పెద్ద కష్టానికి ప్రభుత్వం స్పందించటంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.