CM Revanth Eco Tourism Project Inauguration : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో పలు ఎకో టూరిజం ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు బొటానికల్ థీమ్ పార్కులు, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ప్రకృతి అందాలు చెంతకు తెచ్చే అద్భుతమైన వృక్ష పరిచయ కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అదే విధంగా అటవీ పర్యావరణహిత అభివృద్ది కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
బొటానికల్ గార్డెన్‌లో ఎకో టూరిజం : కొత్తగూడెం, పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, కోదండరెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బొటానికల్ గార్డెన్‌ను సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులను సీఎం పలకరించి కరచాలనం చేశారు.
75 రకాల థీమ్ పార్కులు ఏర్పాటు : దేశంలో తొలిసారిగా సందర్శకులు, విద్యార్థులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన పర్యావరణహిత వృక్ష పరిచయ క్షేత్రంలో 75 రకాల థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు. ఈ వృక్ష పరిచయ క్షేత్రంలో సీతాకోక చిలుక వనం, బతుకమ్మ వనం, నౌక వనం, రంగు రంగుల ఆకుల వనం, సూచిక వనం థీమ్ పార్కులు ఆకట్టుకున్నాయి.